Friday, December 28, 2007

కొత్త రాజ్యాంగం ........ !

కొత్త రాజ్యాంగం ........ !


అదిగో ... వాడు ... ముస్లిం .....
వాడ్ని తెగనరకండి ....!

ఇదిగో ..... వీడు హిందు ....
వీడ్ని కాల్చి బూడిద చెయ్యండి ....!

అదిగో .... వాడి సిద్ధాంతం నచ్చలేదు ..
వాడ్ని .... లేపేయండి ..... !

ఇదిగో .... వీడి వ్యవహారం నచ్చలేదు ....
వీడ్ని ... చంపెయ్యండి ..... !

నచ్చని వాడిని నరికేద్దాం ..,
ఎదురు మాట్లాడిన వాడిని ... లేపేద్దాం ...
ఇదే కదా ... మన కొత్త రాజ్యాంగం ...!

ఇదే కదా ....
మన మానవ జాతి అలిఖిత ...
కొత్త సాంఘిక గ్రంధం ..... !

శాంతా ... ??? ఏ అమ్మాయి పేరది???
సహనమా ...??? ఎక్కడుంది .. ఈ నైట్‌క్లబ్బు ... ???

చెట్లను ..... నరికేస్తున్నాం ...
మన కలల దాహానికి ...!

జంతువులను .... చంపేస్తున్నాం ...
మన ఆకలికి .....!

మనుష్యుల్ని .... కూడా ... చంపేద్దాం ....
మన అహం తృప్తికి .... !

రండి ..
మనిషనే ... ప్రతీ వాడినీ ...
ఏదో ఒక కారణం వెతికి ...వెతికి .....నరికేద్దాం ...!
మనకి నచ్చని ప్రతీవాడినీ .....
ఎదో ఓ మిషతో .... లేపేద్దాం .....!

ఆ శవాల గుట్టలమీంచి నడుచుకుంటూ ..... వెళ్ళి ....
ఆ స్మశానాలను ..... ఆనందంగా ... ఏలుకుందాం .....!

ఛీ ........ ఎక్కడ ఉన్నాం మనం ..... ???


- శ్రీ శైలు .... !
28 - December - 2007; 04:45 AM: Hotel Shangri La, New Delhi ..!

(పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్‌ భుట్టో హత్యోదంతం విన్న షాక్‌లో ........)


************************************

ఆవిర్భావం:


Sarcastic ధోరణిలో రచనలు చెయ్యొద్దని నేనే చాలా సార్లు ... చాలా
మందికి చెప్పడం జరిగింది. కోరడం జరిగింది. కానీ ఇప్పుడు నేనే అలా
రాయడం నాకూ చాలా ఇబ్బందిగానే ఉంది ... !

Flight దిగి, అలా INDIA నేల మీద అడుగుపెట్టి, Hotel గదికి వచ్చి,
T.V. ON చేసేటప్పటికీ ..... BENAJIR'S ASSASINATION అంటూ ....
పెద్ద పెద్ద అక్షరాలతో ..... ఏ ఛానల్లో చూసినా ........ అదే
Scrolling. ఏ ఛానల్ మార్చినా అదే .... విషయం ..... !
విషయం పూర్తిగా చూసి ... ఓ విధమైన షాక్‌కి గురయ్యాను .... !

Diplomatic గా భారత్‌కు పొరుగు దేశంతో ..... సంబంధ బాంధవ్యాలు
పెంచుకునేందుకు మిగిలిన ఆఖరు అవకాశం ఆమె ...! నాకు తెలిసి
పాకిస్థాన్లో మిగిలిన ఏకైక LIBERAL MUSLIM LEADER ఆమే ....! మిగతా
వాళ్ళంతా మత ఛాందస వాదులే ....! పాకిస్థాన్ ఏర్పడిన నాటి నుండి
నేటి వరకూ ..... సరైన VISIONARIES అక్కడ పాలకులుగా రాకపోవడం ఆ
ప్రజల దురదృష్ఠమే తప్ప మరోటి కాదు. మిగిలిన ఒక్క వ్యక్తినీ ఇప్పుడు
... లేకుండా చేసారు ...! ఇదే సాకుగా .... ముషరఫ్ ... మళ్ళీ
EMERGENCY విధించే విధంగా ..... ఖచ్చితంగా ... పావులు కదుపుతాడు.
ఇక అక్కడ ప్రజా స్వామ్య పునరుధ్ధరణ అన్నది నీటి మూటేనేమో ..????

ఇలా జరిగితే ... భారత్‌ - ఇరాన్‌ పైపు లైను పరిస్థితి ఏమిటి ?? ఈమె
అధికారంలోకి రాగానే తేల్చుకుందామన్న మొండి ధైర్యంతోనే కదా భారత్
ఇన్నాళ్ళూ ఊరుకుంది. అదే జరగక పోతే 2010 తరువాత భారత్ పరిస్థితి
ఏమిటి?? ఇంధనం మీదే మెత్తం దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పుడు
ఇంధన భద్రత లేకపోతే పరిస్థితి ఏమిటి?? ONGC, Reliance & Other
Companies private గా లీజుకి తీసుకున్న అన్ని బ్లాకుల్లోనూ oil
production ప్రారంభించినా కూడా .... అవన్నీ కలిపినా .... మెత్తం
Demand లో కనీసం 12% కూడా చెరుకోలెమే ???? అప్పటికి బారెల్ చమురు
ధర 200 డాలర్లు దాటిపోతుందని OPEC చెప్పకనే చెపుతోంది. మరి ఇంధనం
దిగుమతి మీదే ఉన్న విదేశీ మారక ద్రవ్యాన్నంతా ఖర్చు పెడితే
Development సంగతి ఏమిటి? Social Welfare & Rural Infrastructure
ఇవన్నీ ఏమై పోతాయి?? GDP ఏమైపోతుంది ...?? మనమనుకున్న లక్ష్యాలను
ఎలా చేరుకుంటాం?? మెత్తం పరిస్థితే ప్రశ్నార్ధకంగా ఉంది కదా???

ఇవన్నీ ఆలోచించిన తరువాత పుట్టిన షాక్‌లోంచి తయారయ్యిందే ఇది. నాకు
తెలిసి ఇది కవిత కాదు. అక్షరీకృతమైన ఓ బాధ అంతే ...!


ఏది ఏమైనా కాలానికి REWIND బటన్‌ ఉండదు ... !


అందుకే .... ఆమె ఆత్మకి శాంతి కలగాలనీ ...., ఆమెకు ...
అల్లాలోకమయిన ... ఆ ... జన్నత్ ... ప్రాప్తించాలనీ, ఈన్షా అల్లా
..... !

మనస్పూర్తిగా కోరుకుంటూ ....!

- శ్రీ శైలు ... !

Tuesday, December 25, 2007

జగమంత కుటుంబం

జగమంత కుటుంబం

ఏ కులం నేర్పింది .... ???
మనిషిని చిత్ర వధ చేసి చంపడం ..... !

ఏ మతం చెప్పింది ..... ???
మనిషిని చంపి ...,
మారణ హోమం సృష్ఠించమని .... !

ఏ ధర్మం చెప్పింది ..... ???
సాటి మనిషిని ....
నిలువునా .... సజీవ దహనం చెయ్యమని .... !

ఏ జాతీయత నేర్పింది ...... ???
మానవత్వానికి .....
సజీవంగా ... నిప్పంటించమని .... !

ఏ రాజ్యాంగం చెప్పింది ... ???
వ్యక్తి స్వేఛ్ఛనీ .....,
జీవించే హక్కునీ ..... హరించమని ..... !

వద్దు ....... మనకొద్దు ...... !

మనిషిని చంపమని చెప్పే .....
ఏ కులమూ .... మనకొద్దు .... !
మనిషిని మనిషిగా బ్రతుకనివ్వని ....
ఏ ధర్మమూ .... మనకొద్దు ... !
మనిషి నుంచి మనిషిని వేరుచేసే ....
ఏ మతమూ .... మనకొద్దు ..... !
మనసు నుంచి మనసును విడదీసే .....
ఏ జాతీయతా మనకొద్దు ..... !
వ్యక్తి స్వేఛ్ఛనీ .... ,
సహనాన్నీ .... బోధించని .....
ఏ రాజ్యాంగమూ .... మనకొద్దు ..... !

రండి .....!
మనమందరం ప్రపంచ పౌరులుగా .....
ఓ ... వసుధైక కుటుంబాన్ని .... నిర్మిద్దాం .....!

రండి ..... !
రాగ ద్వేషాలు మాని ....
ఈ "జగమంత కుటుంబం" నాది .... అని ...
ఏక కంఠంతో ........
ఎలుగెత్తి ... చాటుదాం ........!

- శ్రీ శైలు .... !
(గోధ్రా, గుజరాత్‌లో జరిగిన ఘోర మారణ హోమానికి స్పందించి, బాధతో .......)

వివరణ:

"కులం" అంటే వృత్తి పని అని అర్ధం. దాన్ని తెలిసీ తెలియకుండా వాడి .... చివరకు ... ఈ రోజుకి ... దాన్నో బూతు పదంగా తయారు చేసారు ..... ! నేను మాత్రం ఇక్కడ దాని అసలు అర్ధంతో వాడడం జరిగింది. గమనించ గలరు ...!

నగరం

నగరం

ఒకప్పుడు ...
ఇక్కడ ఏ నగరమూ లేదు ....!
ఇదంతా బీడే ..... !

ఈ భూమిలో ....
లోహపు విత్తనాలను విత్తి ..... ,
ధనాన్ని ఎరువుగా చల్లగా .... ,
నిటారుగా మొలచి ...,
ఠీవిగా నిలచిన ...,
ఆకాశ హర్మ్యాలతో ...... ఇది ...
ఓ నగర మయ్యింది ... !

ఈ వింతలను చూడవచ్చిన ...
వలస పక్షులతో .....
ఈ నగరం ....
జీవాన్ని సంతరించుకుంది ..... !

ఇప్పుడు ....
ఇక్కడ మరో వింత ప్రారంభమయ్యింది ...!

ఇక్కడ రోడ్లకి .... అడ్డదిడ్డంగా .....,
జనం మొలుస్తున్నారు .... !
ఎటు చూసినా జనం

అటు జనం
ఇటు జనం
పైన జనం
క్రింద జనం
ప్రక్కన జనం
ఎటు చూసినా .... జనం ...... జనం ....!
జనం ......... జనం ........!

అరె ....
ఇది ఇప్పుడో .... మహా నగరం .... !

- శ్రీ శైలు ... !

(మారి పోతున్న నగర స్వరూపాల మీద ఆశ్చర్యం, ఆవేదనతో ... )

చెన్నైలో ... మార్గళి .. !

చెన్నైలో ... మార్గళి .. !

డిశెంబరు నెల మొదలవుతూనే ... ,
నగరాకాశమంతా .... సంగీత మేఘాలు ..
దట్టంగా కమ్ముకుంటాయి ..... !

రాబోయే సంగీత వలస పక్షుల కోసం ...
తన కొమ్మల్ని విశాలంగా విస్తరించుకుని ...
రంగు రంగుల ఆకులూ ... పువ్వులూ ... కప్పుకుని ...
"చెన్నై చెట్టు" అందంగా ... ముస్తాబవుతుంది ......!

సంగీతపు మేఘాల్ని పసిగట్టిన ...
ప్రతి హృదయం .. రాగ రంజితమై ...
హృదయ ద్వారాలకు ... ఆహ్వాన తోరణాల్ని
పచ్చ పచ్చగా అలంకరిస్తాయి ......!

సంవత్సరానికి ఒకసారి వచ్చి ... ,
అనుభూతుల వర్షాన్ని కురిపించి ...
మురిపించే ... ప్రియుల కోసం ...
ప్రతి వేదికా .... ప్రతి సభా ప్రాంగణం .....
వింత వింత సొబగులు అద్దుకుని ....
క్రొత్త శోభనపు పెళ్ళి కూతుళ్ళలా .....
ముద్దు ముద్దుగా తయారవుతాయి ....... !

నగరమంతా .... ఆనందంగా ... ఎదురు చూస్తూంటుంది .... !

మార్గళి మాసం మొదలవుతుంది .....
నగరమంతా ..... పండుగ వాతావరణం ...
మది మదిలో ఉత్సవ కోలాహలం ...... !

వలస కోసం .... దేశం నలుమూలల నుంచీ ...
బయలు దేరిన ... సంగీత కోకిలలన్నీ .....,
తమ స్వంత గూళ్ళలో వాలినంత .... గర్వంగా ..... ,
ఈ "చెన్నై చెట్టు" మీద ... హృద్యంగా ... వాలతాయి .....!

వాలుతూనే ........ స రి గ మ ప ద ని ... అంటూ ..... ,
నగరంలో .... గుట్టనీ ..... మెట్టునీ ....,
చెట్టునీ ..... పుట్టనీ ..... ,
ప్రతి హృదయాన్నీ ..... ,
ఆప్యాయంగా ..... పలకరిస్తాయి ..... !

ఆ అనురాగపు రాగరంజిత స్పర్శకు ....
ప్రతి హృదయం ... పులకరిస్తుంది ...!

అంతే .... ఓ మహోత్సవానికి తెర లేస్తుంది ....!

నెల రోజుల పాటు .....
అవిశ్రాంతంగా .... అవిరామంగా .........
సంగీతం .. ఏరులై పారుతుంది ... !

ఎటు చూసినా సంగీతమే
వీధులన్నీ సంగీత మయం
మది మదిలో సంగీతం
గది గదిలో సంగీతం
హృది హృదిలో సంగీతం ..... !

నిరాఘాటంగా ..... నెలరోజుల పాటు ....
కురిసిన ఆ ఆనందపు సంగీత వర్షంలో ....
నగరమంతా .... తడిసి ... తడిసి ..... ముద్దవుతుంది .... !

ప్రతి హృదయం
ఆ జ్ఞాపకాల్నీ .. ఆ అనుభూతుల్నీ ...... ,
అనన్యంగా ... అపూర్వంగా ... అమూల్యంగా ....
తన మది గదిలో భద్రపరుచుకుంటుంది ...!

రోజులు క్షణాలవుతాయి ...
గడిచి నట్టు తెలియ కుండానే .....
మాసం రోజులు ... ఇట్టే .. గడచి పోతాయి ... !

నగరం మొత్తాన్ని ...
తమ సంగీతంతో ....
ఊయలలూగించి .... జోలలు పాడి ...
ప్రశాంత పరచి .... సాంత్వన చేకూర్చి .....
ఓ అద్భుత అలౌకిక స్థితిలో ... వదలి ... ,
ఆ సంగీత కోకిలలన్నీ ..... ,
నిశ్శబ్దంగా ఎగిరిపోతాయి ....
జీవన ధర్మాన్ని ... వెతుక్కుంటూ ...... !

నగరమూ ...... హృదయమూ ....... మాత్రం ..
వచ్చే మరో మార్గళి కోసం ... ,
అది పంచే అందమైన అనుభూతుల కోసం .... ,
హృదయ ద్వారాలను సంపూర్ణంగా తెరచి ... ,
ఆర్తిగా ..... ఆత్రంగా .....
ఎదురు చూస్తూ ..... ఉంటాయి ..... !

- శ్రీ శైలు ... !
20 - December - 2007; 03:15 AM

వివరణ :

మార్గళి .. అంటే తమిళ సంవత్సరంలో వచ్చే ఒక మాసం. దీనిని మన వాళ్ళు ధనుర్మాసం అని పిలుస్తూ ఉంటారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలోనూ, వైఖానస ఆగమం ప్రకారమూ, పాంచ్యరాత్రాగమం ప్రకారమూ, ఈ మాసానికి విశిష్ఠ ప్రాముఖ్యం ఉంది. గోదా దేవి (ఈమెనే తమిళనాడులో ఆండాళ్‌ అని పిలుస్తారు) విరచితమైన, "తిరుప్పావై" పఠనం, సేవలు, శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో .... ప్రాతః కాల నైవేద్యాలూ ... ఈ మాసం ప్రాముఖ్యతలు. ఆది మహా విష్ణువుకి అత్యంత ప్రీతి పాత్రమైన మాసంగా దీనిని భావిస్తూ ఉంటారు.

వీటితో పాటుగా ... ముత్తైదువులందరూ ఒక చోట చేరి, బొమ్మల కొలువులు (మన వాళ్ళు దసరా సమయంలో చేస్తారు) నిర్వహించి, ఆ కొలువుల్లో ఉత్సవ సంప్రదాయ కీర్తనలని ఆలాపించడం అనేది ... తమిళ దేశంలో .... అనాదిగా వస్తున్న ఆచారం.

అందుకే ఈ మాసంలో ..... చెన్నై నగరమంతా కూడా .. పండుగ వాతావరణం నెలకొంటుంది. కర్ణాటక సంగీతానికి ఈ నెల రోజులూ ఉత్సవ దినాలు. ఈ నెల్లాళ్ళూ చెన్నై కేలండర్‌ ఎంత కిక్కిరిసి పోయి ఉంటుందంటే చెప్పనలవి కాదు. ఏ సభకి వెళ్ళాలో కూడా తెలియనంత అయోమయం ఏర్పడుతూ ఉంటుంది. అన్ని ఎక్కువ సభలు, అంత ప్రాముఖ్యమైన కచేరీలూ జరుగుతూ ఉంటాయి. ఆ అద్భుతాన్ని చూసి తీరవలసిందే కానీ ... మాటల్లో చెప్పడం సాధ్యం కాదు.

వర్ణింపనలవి కాని ఆ మహాద్భుతాన్ని వర్ణించడానికి చేసిన ఓ చిన్న ప్రయత్నమే ఇది.

ఆశీర్వదిస్తారని ఆశిస్తూ .....

మీ ఆదరాభిమానాలతో .....

- శ్రీ శైలు ... !

"ఆమె" కవిత్వం ..... !

"ఆమె" కవిత్వం


రచన :
- శ్రీశైలు


చిరునామా:

SRISAILU
C/O SUBBRAHMANYAM C.V.V.
Door No: 4 - 544, KAKI Street
YANAM - 533 464

Ph: + 91 - 884 - 6450440

Cell: + 91 - 99890 - 83000

Email: SriSailu@bsnl.in

********** అంకితం *********


నా మదిలో కొలువై,
నా ఊహల్లో అనునిత్యం మెదులుతూ,
నిన్న మిగిల్చిన ఓ తీపి జ్ఞాపకంలా,
మనసులో కొలువైపోయి,
నవ్వించి, కవ్వించి,
చివరకు ఏడిపించి వెళ్ళిపోయి,
నాకు ఒక జీవితకాలానికి సరిపడే దుఃఖాంన్ని మిగిల్చి,
నా అణువణువులో కొలువైవున్న
"ఆమె" కు
ప్రేమతో ...........

- శ్రీశైలు

- ౦ -
ఆమె

చిటికెడు చందమామ గంధం,
గుప్పెడు వెన్నెల రజను,
మూరెడు ఇంద్రధనస్సు,
దోసెడు గోదారి నీళ్ళు,
కలిపి చేసిన శిల్పం ..... ఆమె .....!

వంద నవ్వులూ,
వేయి అనుభూతులూ,
లక్ష కోరికలూ,
కోటి ఆశలూ ..... ,
నిండిన నా ఆస్థి ...... ఆమె .....!

ఇన్ని గులాబులూ,
అన్ని చామంతులూ,
ఇన్ని గడ్డిపూలూ,
అన్ని గొబ్బిపూలూ,
కలగలిపిన పూలగంప ...... ఆమె .....!

ఇంత ప్లాటినం,
అంత పాదరసం,
ఇంత బంగారం,
అంత వెండీ,
కలిపి రంగరించిన శిల్పం ...... ఆమె .....!

ఇన్ని వజ్రాలూ,
అన్ని వైఢూర్యాలూ,
ఇన్ని మాణిక్యాలూ,
అన్ని మణిపూసలూ
కలిపి పొదిగిన శిల్పం ...... ఆమె .....!

కలల దారిలోంచి వచ్చి,
నా చేతిని పట్టుకుని
నన్ను నా కలల దారిలోకి తీసుకెళుతోంది.

నవ్వుతూ నవ్విస్తోంది
నవ్వుతూ ఏడిపిస్తోంది.

ఈ పరువాల పిల్లకి,
పూల కిరీట మయ్యేందుకు
పోటీ పడుతూ
పూల చెట్టూ - మల్లెతీగా
సన్నజాజీ - మొగలి పువ్వూ ....!

ఇంద్ర ధనస్సు పరికిణీ కట్టి,
నక్షత్రాలతో జాకెట్టు చేసి,
నెలవంకను ముక్కుపుడక చేసి,
సూర్యుడ్ని పాపిడ బొట్టు చేసి,
కెంపులతో పారాణులద్దీ,
అందంగా అలంకరించీ,
కళ్ళ నిండుగా చూసుకుంటుంటే .......,

ఆమె బుగ్గ మీది పుట్టుమచ్చ
వెక్కిరించింది దిష్ఠి తగులుతుందని ......!
ఎంత పొగరు .... దానికి .....?

- ౦ -
నా మరదలు పిల్ల

ఆమె ..............
నవ్వుతోన్న ఓ నిత్య ప్రవాహం
నీలి పావడా పైకెత్తి పట్టుకుని
తెల్లని పాదాల్తో
పసిడి ఇసుక తిన్నెల వెంబడి
పరుగులెడుతోంది.

గలగలమంటో
గాజుల శబ్దంతో
హృదయం నిండా ప్రేమ నింపుతోంది.

పున్నమినాడు సరేసరి
నిండు చందురుణ్ణి బొట్టెట్టుకుని
ఒడ్డునున్న పడవలో నిద్దరోతోన్న నన్ను
వెన్నెల వానల్లో జోకొడుతోంది.

గోదావరిలా ప్రవహిస్తోంది
గోదావరిలా పరవళ్ళు తొక్కుతోంది

నా మనసు దోచుకున్న పిల్ల గోదావరి
నా మరదలు పిల్ల గోదావరి

- ౦ -
నా భావుకత్వం

హరివిల్లంటి తల్పంమీద
మబ్బుల పరుపులు వాల్చి
మల్లెల దుప్పటీ పరిచి
ఆమె ...... హాయిగా నిద్దరోతోంది.

మల్లెల పక్కమీద మత్తుగా నిద్దరోతున్న
ఆ నిండు పున్నమి జాబిలిని
రెండు కళ్ళారా చూడడమే
ఓ ........... అద్భుత అనుభూతి.

నిద్దరోతున్న ఆ
సుమనోహర శశాంక వదనాన్ని చూస్తూ .......
రాసేదంతా ...... కవిత్వమే .....!

కలలు కంటున్న ఆ ముఖంలోని
సుందర సుమనోజ్ఞ భావాల్ని చూస్తూ ........
గీసేదంతా వర్ణ చిత్రమే .....!

కలత నిదురలో ఆమె చేసే
సుకుమార అవయవ విన్యాసాన్ని చూస్తూ .......
చేసేదంతా నృత్యమే ......!

నిద్దరోతున్న ఆ
ముగ్ధ(ద్ద)రాలి స్నిగ్ధ సౌందర్యంలో,
తడిసి ముద్దవుతూ,
అనుభూతుల అమృతాన్ని .....
కళా రూపాలుగా చేసి
మనసంతా నింపుకోవడమే .....
నా ...... భావుకత్వం .....
- ౦ -
కొబ్బరాకు

ప్రియురాలి కనురెప్పలా
మా డాబా మీద కొబ్బరాకు

కొబ్బరాకులోంచి ఆకాశాన్ని చూసినట్టు
ప్రేయసి కన్నుల్లోంచే ప్రపంచాన్ని చూస్తాను.

నీలాకాశాన్నీ, వెండంచు మబ్బు పింజెల్నీ
అప్పుడప్పుడూ ఇన్ని ఇంద్రధనసుల్నీ .........!

ఓ మంచు బొట్టు
కొబ్బరాకు మీదుగా
నిద్దరోతున్న నా కళ్ళమీద వాలి
చిట్లిన స్వప్నమై - నన్ను నిద్ర లేపుతుంది.

మబ్బుల్లోంచి
కొబ్బరాకు మీద రాలిన చినుకొకటి
నా అరచేతిలో పగిలి
వంద అనుభూతుల్ని నిక్షిప్తం చేస్తుంది.

నిరీక్షణాంతంలో - ఆమె కన్నుల నుండి రాలిన కన్నీటి చుక్క
మా యిరువురి చిరునవ్వుల నడుమ
మంచి ముత్యమై మెరుస్తూంటుంది.

ఈ కొబ్బరాకు నీడలోనే నేను కవిత్వం రాసుకుంటాను
ఆ కనురెప్ప చాటు నుండే జీవించడం నేర్చుకుంటాను .....!

- ౦ -

పాల బువ్వ

సన్నజాజి పందిట్లో
చందమామ వెండి గిన్నె
నీ నవ్వేమో ...........
పాల బువ్వ .....!

- ౦ -

గూర్ఖా

ఆమె ముఖం ........
నిండు చందమామ .....!
చుబుకం మీది పుట్టుమచ్చ
దిష్ఠి చుక్కలా .....
ఆ అందానికి కాపలా కాసే గూర్ఖా ....!

- ౦ -

మంచు ముత్యం

రాత్రి కురిసిన మంచు
ఉదయమవుతూనే
కొబ్బరాకు చివర్న
మంచు ముత్యమై పూసింది ....!

ఎన్ని ముత్యాలు ఏరాలో .......
నా ప్రియురాలి కంఠానికి ... హారమవడానికి .....!

- ౦ -

మనసు పాడే పాట

నిన్ను చూడాలనుకున్నప్పుడూ ......
నిన్ను చూసినప్పుడూ ........
నా మనసు పాట పాడుతూంటుంది...!

ఉన్నట్టుండి గాలి చల్లబడుతుంది
హృదయం వేడెక్కుతుంది
చుట్టుతా మట్టివాసన గుభాళిస్తుంది
పగటి చీకటో, చీకటి పగలో తెలీని
ఓ వింత కాంతి గది నిండా ....... నా మది నిండా .......!

మనసుమీద ఓ మబ్బు తునక నిలబడుతుంది
వానొచ్చే వేళయినట్లు .....
చలిగాలి ....... చల్లగా ........ మెల్లగా ........
నా మనసు పాట పాడుతూ ...... ఉంటుంది .......!

నీ కళ్ళల్లో సీతాకోక చిలుకలెగురుతూ ఉంటాయ్
నా పెదాలమీద మాటల తుమ్మెదలు
మన మధ్య
జీవన సౌందర్యం తాలుకూ
అపురూప సౌరభం గుభాళిస్తూ

ఓ వాన కురిసి వెలుస్తుంది
నీ కళ్ళల్లో ఇంద్రధనసు మెరుస్తుంది
తలపుల సీతాకోకలు
రంగులు రంగులుగా ఎగురుతుంటాయ్
అనుభూతుల తుమ్మెదల ఝుంకారం నేపధ్యంలో
మౌనం మన భాషవుతుంది

నా మనసు పాడుతూనే ఉంటుంది .......!

నీ తలమీద
ఆకాశం నిర్మలంగా పరుచుకుంటుంది
నీ కళ్ళల్లో
నక్షత్రాలు మెరుస్తాయి
నీ పెదాలమీద వెన్నెల కురుస్తుంది
నా మనసు పాట పాడుతూనే ఉంటుంది ......!

వెన్నెల విరిసినప్పుడూ
నవ్వులు కురిసినప్పుడూ
నీ పుట్టుమచ్చ మీద
తియ్యగా నేను ముద్దు పెట్టుకున్నప్పుడూ
నా మనసు పాట పాడుతూనే ఉంటుంది ........!

చివరికి
చంద్ర గ్రహణం మొదలయ్యాక
విరహం నిండిన హృదయంతో
నేను ...... వెళ్ళేందుకు సిద్ధమవుతాను

నీ మనసు పాడే
జాలి పాట
వినేందుకై
నా మనసుని నీ దగ్గరొదిలేసి
నేను మాత్రం ..........
లోకంలోకి వెళ్ళిపోతాను

నా మనసు పాట పాడుతూనే ఉంటుంది ........!

- ౦ -

మురిపెం

వాన వెలిసింది
ఆకుల చివరన
మంచి ముత్యాలు పూసాయి ....!

తడితడిగా ..... ప్రకృతి
అప్పుడే స్నానం చేసి
తడి బట్టల్లో వచ్చిన ....... ప్రియురాల్లా .....!

తడి కళ్ళతో ....... నేను

ప్రకృతిలో ప్రియురాల్నీ
ప్రియురాల్లో ప్రకృతినీ
మురిపెంగా చూసుకుంటూ ............!

- ౦ -

ప్రేమ

విషాదానుభవాల మధ్య
ఒంటరినై
నాకు నేను ప్రశ్ననైనప్పుడు
జవాబులా నువ్వొచ్చావు
అమ్మాయీ ........ నువ్వెవరు ............?

ఆనందం అర్ణవమయ్యి
ఒంటరినై
తోడు కోసం పరితపిస్తున్నప్పుడు
తోడులా నువ్వొచ్చావు
అమ్మాయీ ........ నువ్వెవరు ............?

జీవితపుటెడారిలో దిక్కుతోచక
ఒంటరినై
దిక్కు కోసం పరితపిస్తున్నప్పుడు
ఓ పెద్ద దిక్కులా నువ్వొచ్చావు
అమ్మాయీ ........ నువ్వెవరు ............?

హృదయాన్ని మెలిపెట్టే బాధలోనూ
నీ తలపు ఆనందాన్నిస్తోంది
అమ్మాయీ ........ నువ్వెవరు ............?

తనువును మైమరపించే ఆనందం కూడా
నీవు లేక ..... బాధనే మిగులుస్తోంది
అమ్మాయీ ........ నువ్వెవరు ............?

- ౦ -

క్రిష్ణ వైఢూర్యం

నిండు చందమామ సరే
వినయంగానూ ......... వినమ్రంగానూ .....
గర్వంగానూ ....... అందం గానూ ......
చిక్కంతా ...... నెలవంకతోనే !

దేవుడు ఏ గోటితో మలచిన మలుపులో అవి
వైఢూర్యపు గీతల్లా మెరిసి
ముత్యపుటంచుల్లా మిలమిల్లాడి
వజ్రపు పొడి అద్దిన
పగడాల వగలతో పరిపూర్ణమవుతూ ......

వెన్నెల పరావర్తనాల మీద
ఆమె చీరంచుల పియానోమెట్ల మీదుగానే
మునివేళ్ళతో
ప్రేమ గీతాలు శృతిచేసుకుంటూంటాను

బంగారు కెరటాలమీద
అదనపుటాకర్షణగా
క్రిష్ణవైఢూర్యం లాంటి పుట్టుమచ్చొకటి

ముద్దెట్టుకోమని .......... నన్ను
మరీ ...... మరీ ....... పిలుస్తుంటుంది.

- ౦ -

కొత్త రాగం

రాత్రవుతుంది
వెన్నెల మంచం మీద ......
మల్లెల దుప్పటీ కప్పి .....
పోతపోసిన నిలువెత్తు వెన్నెలలా ....
ఆమె ..... ప్రత్యక్షమవుతుంది .........!

ఆమె పెదవులు వేణువులవుతాయి
ఆమె నడుము సితారవుతుంది
ఆమె జఘనము మృదంగమవుతుంది
ఆమె శరీరము వీణవుతుంది

అన్ని వాయిద్యాలూ తెలిసిన
వాయిద్యకారుడిలా ............ నేను ....!

ఆమెలో ..... కొత్తకొత్త రాగాలు
అన్వేషిస్తూనే ఉంటాను ....
ప్రతి .... రాత్రీ .........!

- ౦ -

ఆమె నీడలో

అనుభూతి విత్తనం మొలకెత్తి ......... మొక్కై
చివుళ్ళేసి ....... చిరునవ్వులు పూస్తోంది

నారు పోసిన వాళ్ళే ..... నీళ్ళూ
పోయాలి అన్నాను రహస్యంగా
ఆమె నవ్వి ........ మళ్ళీ ముద్దిచ్చింది

మొక్క ........ చెట్టై
వృక్షమై ....... మహావృక్షమయ్యింది
ఇపుడది హృదయమంత విశాలం .......!

ఆ చెట్టు నీడలో
అంతా కవిత్వమే ...!

చివుళ్ళేస్తే కవిత్వం
ఆకురాలితే కవిత్వం
పూలుపూస్తే కవిత్వం
చిరుగాలి వీస్తే కవిత్వం ....!

ఇకనాకు నిత్య వసంతం ......!

నేనింక చేయాల్సిందల్లా
ఫలించాలనుకున్నపుడల్లా
ఆమెని ........ ముద్దిమ్మని ....... అడగడమే ...!

- ౦ -

జీవిత సారం

జీవనపోరాటంలో,
ప్రపంచ భ్రమణం చేసి,
అలసి, సొలసి, ఇంటికి చేరి,
సోఫాలో చతికిల బడతాను .........!

నన్ను చూసిన ఆమె ....
మూడేళ్ళ పసిపిల్లయిపోయి
చెంగు చెంగున వచ్చి వళ్ళో వాలిపోతుంది

నులి వెచ్చని కౌగిళ్ళతో .....,
అధరామృతాలతో .....,
ఓ క్రొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది .....!

ఆమె అల్లరితో నీరసాన్ని పోగొట్టి ..,
దాచి పెట్టిన మాటల మూటల్ని .....,
ఒక్కసారిగా విప్పుతుంది.

ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూన్న నాకు ...,
చేయిచ్చి ........,
ఆమె బాహు బంధనాలలో బంధించి
అమ్మవుతుంది ........!

ఆ క్షణం .........
నాకు .......
జీవిత సారం బోధపడుతుంది ....!

- ౦ -

వర్షం

ఉక్కబోస్తున్న శరీరాన్ని
చల్లగాలి సానుభూతిలా చుట్టేస్తుంది
నల్ల చీరె కట్టిన
పల్లె పడుచులా ప్రకృతి తళుక్కున మెరిసి
కళ్ళాపిజల్లినట్లు ........ తడిపేస్తుంది
గట్టునీ ....... మెట్టునీ
వాకిలినీ ...... కోకిలనీ

నేల నుండి నింగికి గిరికీలు కొట్టే పిట్టలా
"ఝుం" మన్న మట్టి వాసన ....... మదిలో పరిమళాలు వెదజల్లి
మస్తిష్కంలో అనుభూతై నిక్షిప్తమవుతుంది ......!

చినుకుల సంగీత కచ్చేరికి
ప్రక్క వాయిద్యాల మోతలా
చిల్లులున్న వంటింట్లో స్టీలు గిన్నెల చిట పట

మంద్రంగా వినిపిస్తూన్న అక్కినేని వానపాట
చిరుజల్లుకీ చలికీ వణుకుతోన్న మనీప్లాంట్ వింత సౌందర్యం

నువ్వూ .......... నేనూ ........
క్షణాల్ని పకోడీల్లా కరిగిస్తూ ........
చిల్లులు పడ్డ ఆకాశానికి చిరుగులు కుట్టేందుకు ప్రయత్నిస్తూ .........!

- ౦ -

కోపం

ఆమె కోపమంటే ........ చచ్చేంత ఇష్టం నాకు

బుజ్జగించీ ......
బతిమాలీ .......
బాహు బంధనాలలో ముంచీ ..... తేల్చీ .....,
ముద్దుల వర్షంలో ...........,
తడిపి ......... తడిపి ..........,
ముద్దచేస్తే ..... కానీ
ఆమె కోపం ........ చల్లారదు ....!

అందుకే .....
ఆమె కోపమంటే చచ్చేంత ఇష్టం నాకు .....!

- ౦ -

ప్రమాణం

ఉంటాను నీకు తోడుగా ......
ఒక్కొక్క క్షణం నీడలా .........!

కాలం కరిగేవరకూ ......
ప్రాణం పొయ్యే వరకూ ......

ఉంటాను నీకు తోడుగా ........
ఒక్కొక్క క్షణం నీడలా ........!

తుది శ్వాస విడిచే వరకూ ......
మరణం చేరువయ్యే వరకూ ......

ఉంటాను నీకు తోడుగా .....
ఒక్కొక్క క్షణం నీడలా ........!

- ౦ -

పౌర్ణమి రాత్రి

పౌర్ణమి రాత్రి ...........

వెన్నెల్లో గోదావరి
పాదరస ప్రవాహమవుతుంది .....!

గట్టున మొలిచిన గడ్డి పూవులా ...... నేను
పువ్వున కురిసిన మంచు బిందువులా ...... నువ్వు

ఒకరి చేతుల్లో ఒకరు కరిగిపోతూ ......
కమ్మని మధుర జ్ఞాపకాల్ని ....
హృదయానికి పట్టించుకుంటూ .....

గోదావరీ - చంద్రుల ప్రియ సమాగమాన్ని .......
కవిత్వంలో వర్ణిస్తూ ........

అనుభూతుల చట్రంలో ......
తైల వర్ణ చిత్రంలా ....... బంధిస్తూ ........!

నువ్వూ .......... నేనూ .........

- ౦ -

ప్రతి సాయంత్రం

సాయంత్ర మవుతుంది
ఓ మనసు .... ఆర్తిగా ....., ఆత్రంగా ......,
ఎదురుచూస్తూ ఉంటుంది ........!

రోజువారీ జీవన పోరాటంలో అలసిపోయి,
నిర్జీవమయిపోయిన శరీరాన్ని మోసుకుంటూ,
ఇంటికి బయలుదేరతాను ......!

వీధి మలుపు తిరుగుతూనే,
గుమ్మానికి వేళ్ళాడేసిన రెండు కళ్ళు
అనురాగాన్ని కురిపిస్తూ .....
ప్రేమగా .......
పలకరిస్తాయి ...........!

నా నిర్జీవమయిన శరీరాన్ని
ఆమె వెచ్చని కౌగిలిలో బంధించి
అధరామృతాలతో ఊపిరులూది
పునః ప్రాణ ప్రతిష్ఠ చేసి
పునరుత్తేజితుడ్ని చేస్తుంది ......!

అనురాగం కంచంలో
ఆప్యాయతను వండి, .... వార్చి, .... వడ్డించి,
కొసరి కొసరి తినిపిస్తుంది .......!

మబ్బుల దుప్పటీ దులిపి
మల్లెల పక్కను వేసి
రంగం సిద్ధం చేస్తుంది ......!

ముద్దు ముద్దుగా ఓ హృదయం ఎదురుచూపు .....!

ఆమె వేళ్ళకి మొలిచిన చిలకలు
నా నోట్లో కరిగి ......, ఆమె నాలుకపై ఎరుపై .....,
ఆమె ప్రేమ గాఢతను తెలియ జేస్తుంది ......!

కౌగిలింతల తాయిలాలతోనూ
మల్లెల తాయెత్తులతోనూ
ముద్దుల మంత్రాలతోనూ
ఆనందపు అర్ణవానికి అవతలి ఒడ్డున దించుతుంది ......!

మడతలు మడతలుగా
పేరుకొంటూన్న అనుభూతి దొంతరలు
చిలికే కొద్దీ చిక్కబడుతున్న కవిత్వం ......!

నడుమును చుట్టిన చేయి
పులకరింపుల స్వప్న స్పర్శ ......!

నా గుండెల మీద తల వాల్చుకుని ...... ఆమె
ఆమె ముంగురులు సవరిస్తూ ........ నేను
నిద్రకు ఉపక్రమిస్తాం ........!

అనివార్యమైన మరో రోజువారీ
జీవన పోరాటానికి
సంసిద్ధమవుతూ .........!

- ౦ -

వరం

చిరునవ్వుల వరమిస్తావా ....?
చితిదాకా తోడొస్తాను ......!

చిరు ప్రేమల వరమిస్తావా ....?
చితి నుంచే లేచొస్తాను ......!

మరు జన్మకు వరమిస్తావా .....?
ఈ క్షణమే మరణిస్తాను .....!

ఈ జన్మకు వరమిస్తావా ....?
మరణాన్నే ఎదిరిస్తాను ......!

- ౦ -

నేస్తం

కన్నీరెందుకు నేస్తం .......?
తోడుందిగా "ఈ" స్నేహ హస్తం .....!

దిగంతాలు సమస్తం .....
జయించుకు రాలేనా నీకోసం ..... నేస్తం ....!

కన్నీరెందుకు నేస్తం .....?
తోడుందిగా "ఈ" స్నేహ హస్తం .......!

- ౦ -

పోస్ట్ మేన్

అతడికి
ఊరొక వాయులీనం
సైకిలు కమానుతో నిత్యం రాగాల్ని శృతి చేస్తూంటాడు ....!

ఇక్కడ శివరంజని
అక్కడ అమర కళ్యాణీ

దిక్కు దిక్కులనుండీ
ఎగిరొచ్చిన
తోకలేని పిట్టలు
అతడి సంచీలోంచి
స్వంత గూట్లోకి హుందాగా వాలినపుడు
అక్కడ అనుభూతుల వాన చినుకుల చప్పుడు

నిలువెత్తు సంతానం
నూర్రూపాయల మనీఆర్డరై
నెలకోసారి అమ్మవైపు చూసినపుడు
మసక బారిన ఆ కళ్ళకి
ఇతడే కనిపించే పెద్దకొడుకు .....!

ఆనంద విషాదాల్ని
అందరికీ పంచుతూ ...... అతడు
ఎప్పుడూ ..........
నన్ను మాత్రం దాటుకుని వెళ్ళిపోతాడు ....!

ఆమె నుండీ ఏ ఉత్తరమూ ... తేనందుకు
నేనేమో ....... అతన్ని .....
మళ్ళీ ...... మళ్ళీ ...... తిట్టుకుంటూ .......!

- ౦ -

నిరంతరం

రాస్తూ మధ్యలో ఆపేసిన
కవితలా ...........
ఆమె అందం ఎపుడూ నన్ను హింసిస్తూనే ఉంటుంది ........!

మబ్బు చాటు చందమామనీ
పొగమంచులో గులాబీ మొగ్గనీ
మేలి ముసుగులో ఆమె లేత బుగ్గనీ
గుడి మైకులో వాయులీన వాదాన్నీ
కోనేటి మెట్టుపై ఆమె పాదాల్నీ
తనివి తీరని భావుకుణ్నై
ఆస్వాదిస్తూంటానా ...........

మబ్బు మేఘమై ఉరుముతుంది
గులాబీ గుచ్చుకుంటుంది
చూపులు అగ్నిహోత్రాలవుతాయి
వాయులీనం విషాదాన్ని ప్రసవిస్తుంది

జీవితంలో నాకు మరో అమావాస్య .......
అంతే ...........

రాస్తూ మధ్యలో ఆపేసిన కవితలా
ఆమె అందం నన్ను హింసిస్తూనే ఉంటుంది ...........!

- ౦ -

నీటి చెలమ (ఒయాసిస్)

ఇసుక తిన్నెలో
ఇంకిపోయిన నిన్నటి నదీ ప్రవాహం

ఆమె నిన్నటి ప్రేమలా ............!

రెల్లు దుబ్బుల కావల మిలమిలమంటో
ఎండమావి జ్ఞాపకం

తీయని ఆమె అనుభూతిలా ...........!

స్నేహ దాహార్తితో హృదయం బీటలు వారుతోంది
కనీసం కన్నీళ్ళనయినా వర్షించలేని వేసవి హృదయపు దిగులు మేఘాలు

ఘనీభవించిన గాలినిండా
మనం కలసి పాడుకున్న పాటల రాగాలే

ఆ చిరపరిచిత స్వర మధురిమ కోసం
వెదురు పొదల చెంతన ఒంటరిగా

నీటి చెలమ కోసం .................

వెదుకులాడుతూ ..........
ఇసుకని తవ్వుకుంటూ .................

- ౦ -

వెన్నెల జోల

పది రోజుల చందమామని
పదిన్నర వేళప్పుడు
పది మందీ నిద్దరోతున్న వేళ
పనిగట్టుకు మరీ చూడడం ......
ఎంత బావుంటుంది ............!

అతడో దర్జా దొంగ
నన్ను చూడగానే
గోడదూకి లోనికొచ్చి
కిటికీ ప్రక్కన సిగ్గుపడుతోన్న
మనీ ప్లాంట్ బుగ్గ మీద
చల్లగా చిటికేసి
హుందాగా నా గదిలోకొచ్చి
నాతో కబుర్లు మొదలెడతాడు ......!

ఆమె గుర్తొస్తుంది
ఆమె నవ్వు గుర్తొస్తుంది ........!

మూర్తీభవించిన వెన్నెల కదూ ఆమె రూపం
ఆ వెన్నెల వీచే చల్లని కాంతులే కదూ ఆమె నవ్వు ....!

అపురూపమైన ఆమె జ్ఞాపకానికి
నులివెచ్చని హాయేదో ........
హృదయమంతా పరుచుకుని
ఒంటి నిండా నైట్‌క్వీన్ పరిమళం ......!

ఆమె జ్ఞాపకాల అలజడికి .....
రెప్పల మాటున ఓ కన్నీటి ముత్యం ప్రాణం పోసుకుంటుంది .....!
మనసు కార్చిన కన్నీటితో గుండె బరువెక్కుతుంది ....!

విషాదంలోని నాకు .....
చందమామ నవ్వుతూ ......
వెన్నెల జోలలు పాడేసి ....
మబ్బుల చాటుకెళ్ళిపోతాడు ....
పెద్ద పని ఉన్నట్లుగా ......

గదిలో .......
ఒంటరిగా ...............

నేను ...... ఆమె జ్ఞాపకాలు ........!

- ౦ -

జీవన సౌందర్యం

వెన్నెల పుప్పొడి రాలుస్తోన్న ...
జాబిలి పుష్పం ..........!

మిణుకు మిణుకుమంటోన్న జ్ఞాపకాల చుక్కల మధ్య
నిశ్శబ్దంగా ఎగురుతున్న ఆలోచనల తుమ్మెదలు ........!

హృదయాకాశంలో నిండుగా పరుచుకున్న ......
కన్నీటి మబ్బులు ...........!

ఆమె లేని పగటి కన్నా
ఆమెలా ఉన్న చందమామ వెలుగుతోన్న
రాత్రంటేనే ......... ఇష్టం నాకు .....!

దోసెడు వెన్నెల్ని
కన్నుల నిండుగా నింపేసుకోవడమే
అమృత సేవనమంటే .............!

గంపెడాశలతో కన్నా ......
గుప్పెడు ఆమె జ్ఞాపకాలతో ..... బతికెయ్యడమే ......
సౌందర్య జీవనమంటే ..........!

- ౦ -

ఒంటరి ప్రయాణం

చీకట్లో .....
రైలు ప్రయాణం .............!

కాలం పట్టాలమీద .....
కలల రైలెక్కి ....
అనుభూతుల స్టేషన్ల మీదుగా ....
సాగిపోతూ ............
చీకట్లో కలిసిపోతూ ........
కరిగిపోతూ ............!

వెలుతురొచ్చి చూస్తే .....
నువ్వు నాప్రక్కన లేవు .........!

ఏ స్టేషన్లో దిగి పోయావు ..
నువ్వు ప్రియతమా .......?

నా స్టేషనొచ్చింది
నేను రైలు దిగాను ...........

నాతో పాటే ................ నా ఒంటరితనమూ ..........!

- ౦ -

కనకాంబరాలు

కళతప్పిన జీవితానికి
కలే ఊపిరైనప్పుడు ..........,

కనకాంబరం పూల చెండై
స్పర్శించిన ఆమె చిరునవ్వుల పలకరింపు .......!

ముళ్ళ కిరీటం ధరించిన
ఈ గులాబి హృదయం
ఒక్కొక్క రేకు మీదా ..........,

ముత్యాలై మెరుస్తోన్న
ఆమె మాటల మంచు బొట్లు ........!

ఆకాశమంతా ...
కనకాంబరం పూల రంగేసుకుంది ....!

సూర్యోదయం అక్కడే ......... అలాగే .......
ఆగిపోతే ఎంత బావుణ్ణు ...!

ఆమె ముందర మోకరిల్లి
ఆనంద క్షణాలకోసం ...... దోసిలి పడతాను ...!

ఆమె ఒక .....
కనకాంబరం పూల చెండు .....!

ఆమె నవ్వొక కనకాంబరం ...!
ఆమె మనసొక కనకాంబరం .....!

ఆమె మాటలు ........
జల జలా రాలుతున్న కనకాంబరాల వాన ......!

ఆమెతో కలసి నడచిన క్షణాల సాక్షిగా
ఆడుగడుగునా పోగుచేసుకున్న అనుభూతి దొంతరల మధ్య
సుతారంగా ...........
సున్నితంగా ............

ఆమె నుదుటన ముద్దు పెట్టుకుంటాను ........!

ఎవరన్నారు .......?
కనకాంబరాలు పరిమళించవని .......?

- ౦ -

నిశ్శబ్ద గాంధర్వం

పూల కుండీల్లో మొక్కలు
పూల గౌనుల్లో ముస్తాబై
తేనెటీగల్తో తియ్యని కబుర్లు చెప్తున్న వేళ ........!

గోర్వెచ్చగా సూర్యుడు
కిరణ తోరణాలను
కిటికీలకు కడుతున్నప్పుడు ........,
డ్రిల్లు మాస్టారి ఈలలా
గంయ్ మనడానికి సిద్ధంగా ఉన్న
అలారం పీకని నిర్దాక్షిణ్యంగా నులిమేస్తాను .......!

రాత్రి రాలి పడ్డ నక్షత్రాలు
కలల కబుర్లు చెపుతుంటే
కళ్ళు మూసుకుని తన్మయత్వంతో వింటూ
ఆమె నిద్దరోతోంది .....!

ష్ ................ ష్ .............

నిశ్శబ్దంగా ఉండండి
ఎవరూ మాట్లాడకండి
ఆమె నిద్రపోతోంది ..........!

దట్టమైన పొగమంచు కింద
ప్రశాంత గోదారిలా ........,
పసిపాపలా .........,
ఆమె నిద్రపోతోంది .......!

ష్ .... ఎవరూ మాట్లాడకండి ...!

సూర్యుడ్ని కూడా సడి చేయకుండా రమ్మనండి ...!

తన పాదాల్ని అతి సుతారంగా ...
నీటి అద్దం మీద మోపమని .....
ఆ పరికీణీ పిల్లకి .... నెమ్మదిగా చెప్పండి .....!

ఆమె కంటి మడుగులో
కలలు అలలౌతున్నాయి ...!

ఒకవేళ మెలుకువొస్తే ....
కొబ్బరాకు విసనకర్రతో ...
సిధ్ధంగా ఉండమని ముసలమ్మ రావి చెట్టుకి ...
గుస గుసగా చెప్పండి ...........!

ఇక్కడ తులసి కోటకి జారబడి
కొమ్మల్లో చిక్కుకున్న గాలిపటాల కలలు కనండి ...!

చింత చెట్టుకు కాస్త దూరంలో
మంచులో తడుస్తోంది ...... నా ప్రేయసి పోలికల్లో ఉన్న .....
ముద్ద బంతి .......!

పొద్దెక్కి ఆమె నిద్ర లేచేలోగా ...
అరవిరిసిన తామరాపుష్పాల్లాంటి .... ఆమె కళ్ళను ...
ఆర్తిగా ...... సుతారంగా ........
ముద్దు పెట్టుకుంటాను ....... చప్పుడు చేయకుండా ........!

నిద్రలో ఆమె గలగలల ......
నిశ్శబ్ద సంగీతాన్ని....
కళ్ళు మూసుకుని వింటూ ......
........ ............ .......... ........

లోకాన్ని మరిచి పోతాను ............!
- ౦ -

- శ్రీ శైలు ....... !