Tuesday, December 25, 2007

చెన్నైలో ... మార్గళి .. !

చెన్నైలో ... మార్గళి .. !

డిశెంబరు నెల మొదలవుతూనే ... ,
నగరాకాశమంతా .... సంగీత మేఘాలు ..
దట్టంగా కమ్ముకుంటాయి ..... !

రాబోయే సంగీత వలస పక్షుల కోసం ...
తన కొమ్మల్ని విశాలంగా విస్తరించుకుని ...
రంగు రంగుల ఆకులూ ... పువ్వులూ ... కప్పుకుని ...
"చెన్నై చెట్టు" అందంగా ... ముస్తాబవుతుంది ......!

సంగీతపు మేఘాల్ని పసిగట్టిన ...
ప్రతి హృదయం .. రాగ రంజితమై ...
హృదయ ద్వారాలకు ... ఆహ్వాన తోరణాల్ని
పచ్చ పచ్చగా అలంకరిస్తాయి ......!

సంవత్సరానికి ఒకసారి వచ్చి ... ,
అనుభూతుల వర్షాన్ని కురిపించి ...
మురిపించే ... ప్రియుల కోసం ...
ప్రతి వేదికా .... ప్రతి సభా ప్రాంగణం .....
వింత వింత సొబగులు అద్దుకుని ....
క్రొత్త శోభనపు పెళ్ళి కూతుళ్ళలా .....
ముద్దు ముద్దుగా తయారవుతాయి ....... !

నగరమంతా .... ఆనందంగా ... ఎదురు చూస్తూంటుంది .... !

మార్గళి మాసం మొదలవుతుంది .....
నగరమంతా ..... పండుగ వాతావరణం ...
మది మదిలో ఉత్సవ కోలాహలం ...... !

వలస కోసం .... దేశం నలుమూలల నుంచీ ...
బయలు దేరిన ... సంగీత కోకిలలన్నీ .....,
తమ స్వంత గూళ్ళలో వాలినంత .... గర్వంగా ..... ,
ఈ "చెన్నై చెట్టు" మీద ... హృద్యంగా ... వాలతాయి .....!

వాలుతూనే ........ స రి గ మ ప ద ని ... అంటూ ..... ,
నగరంలో .... గుట్టనీ ..... మెట్టునీ ....,
చెట్టునీ ..... పుట్టనీ ..... ,
ప్రతి హృదయాన్నీ ..... ,
ఆప్యాయంగా ..... పలకరిస్తాయి ..... !

ఆ అనురాగపు రాగరంజిత స్పర్శకు ....
ప్రతి హృదయం ... పులకరిస్తుంది ...!

అంతే .... ఓ మహోత్సవానికి తెర లేస్తుంది ....!

నెల రోజుల పాటు .....
అవిశ్రాంతంగా .... అవిరామంగా .........
సంగీతం .. ఏరులై పారుతుంది ... !

ఎటు చూసినా సంగీతమే
వీధులన్నీ సంగీత మయం
మది మదిలో సంగీతం
గది గదిలో సంగీతం
హృది హృదిలో సంగీతం ..... !

నిరాఘాటంగా ..... నెలరోజుల పాటు ....
కురిసిన ఆ ఆనందపు సంగీత వర్షంలో ....
నగరమంతా .... తడిసి ... తడిసి ..... ముద్దవుతుంది .... !

ప్రతి హృదయం
ఆ జ్ఞాపకాల్నీ .. ఆ అనుభూతుల్నీ ...... ,
అనన్యంగా ... అపూర్వంగా ... అమూల్యంగా ....
తన మది గదిలో భద్రపరుచుకుంటుంది ...!

రోజులు క్షణాలవుతాయి ...
గడిచి నట్టు తెలియ కుండానే .....
మాసం రోజులు ... ఇట్టే .. గడచి పోతాయి ... !

నగరం మొత్తాన్ని ...
తమ సంగీతంతో ....
ఊయలలూగించి .... జోలలు పాడి ...
ప్రశాంత పరచి .... సాంత్వన చేకూర్చి .....
ఓ అద్భుత అలౌకిక స్థితిలో ... వదలి ... ,
ఆ సంగీత కోకిలలన్నీ ..... ,
నిశ్శబ్దంగా ఎగిరిపోతాయి ....
జీవన ధర్మాన్ని ... వెతుక్కుంటూ ...... !

నగరమూ ...... హృదయమూ ....... మాత్రం ..
వచ్చే మరో మార్గళి కోసం ... ,
అది పంచే అందమైన అనుభూతుల కోసం .... ,
హృదయ ద్వారాలను సంపూర్ణంగా తెరచి ... ,
ఆర్తిగా ..... ఆత్రంగా .....
ఎదురు చూస్తూ ..... ఉంటాయి ..... !

- శ్రీ శైలు ... !
20 - December - 2007; 03:15 AM

వివరణ :

మార్గళి .. అంటే తమిళ సంవత్సరంలో వచ్చే ఒక మాసం. దీనిని మన వాళ్ళు ధనుర్మాసం అని పిలుస్తూ ఉంటారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలోనూ, వైఖానస ఆగమం ప్రకారమూ, పాంచ్యరాత్రాగమం ప్రకారమూ, ఈ మాసానికి విశిష్ఠ ప్రాముఖ్యం ఉంది. గోదా దేవి (ఈమెనే తమిళనాడులో ఆండాళ్‌ అని పిలుస్తారు) విరచితమైన, "తిరుప్పావై" పఠనం, సేవలు, శ్రీ వైష్ణవ క్షేత్రాల్లో .... ప్రాతః కాల నైవేద్యాలూ ... ఈ మాసం ప్రాముఖ్యతలు. ఆది మహా విష్ణువుకి అత్యంత ప్రీతి పాత్రమైన మాసంగా దీనిని భావిస్తూ ఉంటారు.

వీటితో పాటుగా ... ముత్తైదువులందరూ ఒక చోట చేరి, బొమ్మల కొలువులు (మన వాళ్ళు దసరా సమయంలో చేస్తారు) నిర్వహించి, ఆ కొలువుల్లో ఉత్సవ సంప్రదాయ కీర్తనలని ఆలాపించడం అనేది ... తమిళ దేశంలో .... అనాదిగా వస్తున్న ఆచారం.

అందుకే ఈ మాసంలో ..... చెన్నై నగరమంతా కూడా .. పండుగ వాతావరణం నెలకొంటుంది. కర్ణాటక సంగీతానికి ఈ నెల రోజులూ ఉత్సవ దినాలు. ఈ నెల్లాళ్ళూ చెన్నై కేలండర్‌ ఎంత కిక్కిరిసి పోయి ఉంటుందంటే చెప్పనలవి కాదు. ఏ సభకి వెళ్ళాలో కూడా తెలియనంత అయోమయం ఏర్పడుతూ ఉంటుంది. అన్ని ఎక్కువ సభలు, అంత ప్రాముఖ్యమైన కచేరీలూ జరుగుతూ ఉంటాయి. ఆ అద్భుతాన్ని చూసి తీరవలసిందే కానీ ... మాటల్లో చెప్పడం సాధ్యం కాదు.

వర్ణింపనలవి కాని ఆ మహాద్భుతాన్ని వర్ణించడానికి చేసిన ఓ చిన్న ప్రయత్నమే ఇది.

ఆశీర్వదిస్తారని ఆశిస్తూ .....

మీ ఆదరాభిమానాలతో .....

- శ్రీ శైలు ... !

No comments: