కాలేజీ
పరికిణీ జాకెట్లూ .....,
రంగుల ఓణీలూ ......,
పూల చొక్కాలూ ......,
తొడుక్కున్న రంగు రంగుల సీతాకోక చిలుకలు ......,
పల్లె పల్లెల్నించీ ......,ఎక్కడెక్కడ్నుంచో ... బయలుదేరి ...,
సైకిళ్ళెక్కి ........,
మిలటరీ కవాతు చేసుకుంటూ ......,
వచ్చీ ....... వచ్చీ .....,
ఈ ఆవరణంలో ..... అందంగా వాలతాయి ........ !
ఠంగ్ ....... ఠంగ్ ...... ఠంగ్ .... మంటూ ....
మ్రోగిన గంట శబ్దం ....
ఓ పండుగ వాతావరణానికి ....అందమైన శుభారంభంలా .....
సుమనోహరంగా ...మ్రోగి ....,
అందరి హృదయాలనూ .....ఉత్తేజ పరుస్తుంది ........!
అంతే ..... ఓ ..పండుగ ప్రారంభమవుతుంది ......!
కారిడార్ల నిండా మాటల నదీ ప్రవాహాలు ....
సుళ్ళు తిరుగుతూ ...... అవిశ్రాంతంగా .....ప్రవహిస్తూనే .... ఉంటాయి ......!
కొత్తగా పూచిన నవ్వుల పువ్వులతో .......,
కాలేజీ ఆవరణమంతా .........,
క్రొత్తగా ........ వింతగా ...., శోభాయమానంగా మెరుస్తుంటుంది .....!
అమ్మాయిల సౌరభానికి ......
నవ్వుల వింత గుబాళింపులు కలిపి ...
కొత్త కొత్త ...... వింత వింత .....
వాసనలను ఉత్పత్తి చేస్తాయి ..... లాబరేటరీలు ......!
లైబ్రరీలో .......,
మాసిన నిశ్శబ్దం మధ్య ....,
స్తబ్దంగా ..... పడి ఉన్న .......
రోమియో ... జూలియట్‌లు .....,
లైలా .... మజ్ఞూలూ .....,
దేవదాసు ... పార్వతిలూ.....,
విద్యార్ధుల చేతుల్లో ...... మళ్ళీ కొత్తగా .....
ప్రాణం పోసుకుంటారు .....!
జార్జ్ బుష్ నుంచి ...... ఇరాక్ యుధ్ధం వరకూ .....,
ఐశ్వర్యా రాయ్ నుంచీ ..... అప్పల నరసయ్య వరకూ ....,
మార్లిన్ మాన్రో నుంచి ..... మునసబు, కరణం వరకూ .....,
అందరూ కాలక్షేపం బఠానీలైపోయి .......
విద్యార్ధుల పళ్ళ క్రింద .... పట .. పటా ..... నలుగుతుంటారు .......!
క్యారిడార్లను ముంచెత్తిన ...అల్లర్ల వరద ప్రవాహం .......,
క్లాసురూము గడప దగ్గర కొచ్చేసరికీ ......నిశ్చల నదీ ప్రవాహంలా .........,
స్తబ్దంగా ..... సాగిపోతుంది .....!
ఆ విజ్ఞానపు నదీ ప్రవాహంలో .......
శిక్షకుడి చేతిని ..... చుక్కానిలా పట్టుకుని .....
ఆనందపు అద్దరిని చేరేలోపు .......
ఠంగ్ ..... ఠంగ్ ..... ఠంగ్ ..... మంటూ ....మళ్ళీ ....... గంట మ్రోగుతుంది .....!
అంతే .......! ఓ పండుగ ముగిసిపోతుంది .......!
రంగుల సీతాకోక చిలుకలన్నీ .......,
జట్లు జట్లుగా .......... చటుక్కున ......
తమ తమ ఇళ్ళకు ఎగిరిపోతాయి ....!
ఉదయంనుంచీ ........., క్యారిడార్లలోనూ .......,క్లాసురూముల్లోనూ ........,
పేరుకుపోయిన ..... నవ్వుల పువ్వులన్నింటినీ ......,
ఊడ్చి ..... చెత్త కుండీలో పోసేస్తాడు .... స్వీపరు ....!
కాలేజీ మాత్రం .........
కళను కోల్పోయి .....
అలాగే నిలబడి పోతుంది .........
నిస్తేజంగా ............ నిర్వీర్యంగా ............
రేపటి మరో పండుగ కోసం ..........,
ఎదురు చూస్తూ ...........................!
- శ్రీశైలు .....!
(19 - June - 1995; 18:55 PM; YANAM Residence)
(డిగ్రీ కాలేజీలో చేరి, మెదటి రోజు కాలేజీకి వెళ్ళి, ఇంటికి తిరిగొచ్చిన వెనువెంటనే కలిగిన భావ స్ఫూర్తితో ............... ఈ చిన్న కవిత!)
No comments:
Post a Comment