గోడలు ...... గోడలు .......
చుట్టూ గోడలు ........!
నలు దిక్కులలో ...., నలు మూలలలో .....,
మేమున్నామంటూ నిలచె గోడలు ......!
తూరుపు దిక్కున మతాల గోడలు
పడమర దిక్కున కులాల గోడలు
ఉత్తర దిక్కున తరాల గోడలు
దక్షిణ దిక్కున అంతరాల గోడలు .......!
ఆగ్నేయంలో అంతస్థుల గోడలు
నైఋతిలో నైరాశ్యపు గోడలు
వాయవ్యంలో వలస గోడలు
ఈశాన్యంలో ఈర్ష్యల గోడలు .......!
గోడలు ...... గోడలు .......
చుట్టూ గోడలు .......!
నలు దిక్కులలో, నలు మూలలలో,
ఎటు చూస్తే అటే, నిలచె గోడలు ......!
పుడమి తల్లి పొత్తిళ్ళను సైతం
ఖండాలుగా ముక్కలు చేస్తూ ....,
ధరిత్రిపై ధీరుగా నిలచిన
ఖండాల సరిహద్దుల గోడలు ......!
గోడలు ..... గోడలు .....
చుట్టూ గోడలు .....!
ఖండాలను ముక్క చెక్కలు చేస్తూ ...,
మేరు నగంగా ..., ధీర నగంతో ...,
భూమాత ఒడిని బద్దలు చేస్తూ ...,
దేశాల సరిహద్దుల గోడలు ....!
గోడలు ..... గోడలు .....
చుట్టూ గోడలు .....!
దేశాన్ని ముక్కలు చేస్తూ ....
రాష్ట్రాల హద్దుల గోడలు;
రాష్ట్రాన్ని చెక్కలు చేస్తూ ....
ప్రాంతాల హద్దుల గోడలు;
ప్రాంతాన్ని బద్దలు చేస్తూ .....
జిల్లాల హద్దుల గోడలు;
జిల్లాల్ని విభజన చేస్తూ .....
మండలాల హద్దుల గోడలు;
మండలాన్ని ముక్కలు చేస్తూ .....
గ్రామాల సరిహద్దుల గోడలు .......!
గోడలు ..... గోడలు .....
చుట్టూ గోడలు .....!
నలుదిక్కులలో ...., నలుమూలలలో ....,
ఎటు చూస్తే అటే .... నిలచె గోడలు .....!
మనిషిని మనిషిని వేరు చేస్తూ ......
మతాల గోడలు; కులాల గోడలు;
రాష్ట్ర, ప్రాంతాల అధికారపు గోడలు;
పౌర సత్వాల పేపరు గోడలు;
గోడలు ..... గోడలు .....
చుట్టూ గోడలు .....!
మనసుని మనసుని వేరు చేస్తూ .....
రాగ ద్వేషాల రాక్షస గోడలు;
ఈర్ష్య అసూయల ఇనుప గోడలు;
చాదస్తపు ఛండాలపు గోడలు;
గోడలు ..... గోడలు .....
చుట్టూ గోడలు .....!
మానవత్వాన్ని మంట గలుపుతూ .....
అధికార దర్పపు దళసరి గోడలు;
స్వార్ధ పరత్వపు సొగసరి గోడలు;
ఆయుధాల ఆక్రందనల గోడలు;
గోడలు ..... గోడలు .....
చుట్టూ గోడలు .....!
మనిషిని, మనిషిని మృగాన్ని చేస్తూ .....
ధన దాహపు దట్టపు గోడలు;
రాజ్య కాంక్షల రక్కసి గోడలు;
అహంభావాల అద్దాల గోడలు;
దౌర్జన్యపు దుర్గంధపు గోడలు;
గోడలు ..... గోడలు .....
చుట్టూ గోడలు .....!
నలు దిక్కులలో ...., నలు మూలలలో ....,
ఎటు చూస్తే అటే .... నిలచె గోడలు .....!
రారండోయ్ ...... రారండోయ్ ....
కార్మిక, కర్షక, హాలిక, శ్రామిక,
పండిత, పామర, బాల, గోపాల,
జనైకులారా రారండోయ్ ...!
కత్తీ, కోడవలి, సుత్తీ, శానం,
గడ్డ పారలూ, సమ్మెట దిమ్మలను,
సాన బట్టుకుని ..., చేత బెట్టుకుని,
కదం కలుపుతూ ..., పదం పాడుతూ ....,
కార్మిక, కర్షక, హాలిక, శ్రామిక,
పండిత, పామర, బాల, గోపాల,
జనైకులారా రారండోయ్ ...!
కూల్చండోయ్ ...... కూల్చండోయ్ .......
కుల మతాల కుళ్ళు గోడలను;
అధికారపు దౌర్జన్యపు గోడలను;
స్వార్ధ పరత్వపు సొగసు గోడలను;
తర తరాల అంతరాల గోడలను;
మనిషిని, మనిషిని వేరు చేసే .....
గోడను, గోడను, ప్రతీ గోడనూ;
మానవత్వాన్ని సమాధి చేసే ......
చలువ రాళ్ళ ఛండాలపు గోడలను;
కూల్చండోయ్ ...... కూల్చ్ండి ...!
కూల్చండోయ్ ...... కూల్చ్ండి ...!
రారండోయ్ ........ రారండి
రారండోయ్ ........ రారండి
ఎల్లలు లేని, హద్దులు లేనీ ....,
విశాల విశ్వం, సమైక్య విశ్వం,
శ్రమ పడి మరీ నిర్మిద్దాం ....!!
మనుషులందరూ ఒక్కటేననీ ....,
మానవ లోకం ఒక్కటేననీ ....,
గొంతెత్తి మరీ చాటేద్దాం .....!!
సమైక్య మానవ సమూహ ఘోషతో ...,
మానవత్వమే మహోన్నతమని..,
ఊర్ధ్వ, అధో లోకాలన్నిట ...,
ముక్త కంఠంతో చాటేద్దాం .....!!
- శ్రీ శైలు ....!
(20 - MAY - 1990; 11:15 AM; High School Science Laboratory; YANAM)
(సమైక్య ప్రజా ఉద్యమాలకు కాలం చెల్లి పోయిందంటూ మేధావి వర్గం చూపిస్తున్న, నిరుత్సాహ పూరిత ధోరణులకు చరమ గీతం పాడుతూ, చివరకు జయించేది మానవత్వమే అన్న నా వాదనలకు బలం చేకూరుస్తూ....., తూర్పు, పశ్చిమ జర్మనీల మధ్యనున్న బెర్లిన్ గోడను, ప్రజలే కూల్చి వేశారన్న వార్త చదివిన ఆనందంలో ములిగి తేలుతూ......, ఉబ్బి తబ్బిబ్బవుతూన్న తరుణంలో ..., అప్పటికప్పుడు పుట్టిన ఆనంద హేలిక, ఈ కవితా మాలిక ...! నా ఆనందానికి అవధులు లేనట్లే ..... దీన్లో కొంచెం కవిత్వపు లక్షణాలు తక్కువే ...!)